ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రాష్ట్రం మీదుగా తొలిసారిగా వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనుంది. బెంగళూరుముంబయి మధ్య నడిచే ఈ రైలుకు అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో నిలుపుదల కల్పించారు. దీంతో రాయలసీమ ప్రాంత ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
రైల్వే శాఖ ఇప్పటికే బెంగళూరు నగరంలోని కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు వందే భారత్ స్లీపర్ సేవను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ రైలును ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. వారానికి ఆరు రోజులు రైలు నడిపే ప్రతిపాదన ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం, ముంబయి నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరుకు చేరుకోనుంది. బెంగళూరు నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ముంబయి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. మొత్తం ప్రయాణ సమయం సుమారు 16 గంటలు ఉండనుంది.
ఈ రైలుకు మహారాష్ట్రలో కల్యాణ్, పుణె, సోలాపూర్, కర్ణాటకలో కలబురగి, రాయచూర్, ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, గుంతకల్లు స్టాప్‌లు ఉండనున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం ప్రాంతాల్లోనూ నిలుపుదల కల్పించాలని గతంలో డిమాండ్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ప్రతిపాదించిన షెడ్యూల్లో ఆ స్టేషన్లు లేవని సమాచారం.
16 కోచ్‌లతో రైలు
బెంగళూరుముంబయి వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి. ప్రయాణికుల కోసం మొదటి తరగతి ఏసీ, రెండంచెల ఏసీ, మూడంచెల ఏసీ పడక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. మొత్తం సుమారు 823 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఈ రైలుకు ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.
రాయలసీమ ప్రయాణికులకు ప్రయోజనం
అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో నిలుపుదల కల్పించడంతో రాయలసీమ ప్రాంత ప్రజలకు బెంగళూరు, ముంబయి వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారం, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ఈ నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ స్లీపర్ రైలు ఉపయోగపడే అవకాశం ఉంది.
వందే భారత్ స్లీపర్ సేవలు ప్రవేశపెట్టడం వల్ల దీర్ఘదూర ప్రయాణాల్లో వేగం, సౌకర్యం పెంచడమే లక్ష్యంగా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటోంది. అయితే, రైలు ప్రారంభ తేదీ, తుది సమయ పట్టిక, టికెట్ ధరలు వంటి వివరాలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











