మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంఎస్పీఎస్సీ)లో సంస్కరణలు, నియామక ప్రక్రియలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పది రోజులుగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులు తమ నిరసనను విరమించారు. ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీకి మాజీ న్యాయమూర్తి దిలీప్ భోసలే అధ్యక్షత వహించనుండగా, రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ కమిషనర్ తుకారాం ముండే కార్యదర్శిగా నియమితులయ్యారు. ఐపీఎస్ అధికారి లక్ష్మి గౌతమ్, మాజీ ఐఏఎస్ అధికారి గణేశ్ పాటిల్, విశ్రాంత న్యాయమూర్తి పి.డి. నాయక్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
పుణెలోని ఎస్.ఎం. జోషి వంతెన వద్ద నిరసన చేస్తున్న అభ్యర్థులతో రాష్ట్ర మంత్రి శివేంద్రరాజే భోసలే చర్చలు జరిపారు. పేపర్ లీక్ ఆరోపణలు, నియామక ప్రక్రియలో అవకతవకలతో సహా కమిషన్ పనితీరుపై కమిటీ విచారణ జరిపి, సంస్కరణలను సూచించనుంది.
మూడు సంవత్సరాల్లో 70 వేల ఉద్యోగాల భర్తీ, జనవరిలో జరగనున్న గ్రూప్-సీ పరీక్షలో పోస్టుల సంఖ్య పెంపు, ఆందోళన ప్రతినిధులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. కమిషన్ ఛైర్మన్, కార్యదర్శుల నియామకానికి ముందు వారి నేపథ్యాన్ని పరిశీలించాలన్న డిమాండ్‌నూ అభ్యర్థులు ముందుకు తెచ్చారు.
ఇదిలా ఉండగా, ఎంఎస్పీఎస్సీ ఛైర్మన్ వివేక్ భీమన్వార్ విచారణ పూర్తయ్యే వరకు సెలవులో ఉంటానని ప్రకటించారు. ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని కొందరు అభ్యర్థులు పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి ఇతర డిమాండ్లపై హామీ ఇవ్వడంతో ఆదివారం అర్ధరాత్రి నిరసనను విరమించారు.
కమిటీ విచారణలో వెలువడే అంశాలు, సిఫార్సుల ఆధారంగా నియామక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేపడతారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.











